కాంగ్రెస్ గూటికి సోనూ సూద్ సోదరి..

లాక్ డౌన్ లో వలస కార్మికుల కష్టాలు తీర్చి లాక్ డౌన్ హీరోగా మారిన సోనూ సూద్ ఎట్టకేలకు కాంగ్రెస్ చేతికి చిక్కారు. సోషల్ మీడియాలో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించిన సినీ నటుడు సోనూ సూద్ ని తమవైపు తిప్పుకోడానికి అప్పట్లో అన్ని పార్టీలు ప్రయత్నించాయి. తనకు భారీ ఆపర్లు ఇవ్వబోయినా తిరస్కరించారని స్వయంగా సోనూ సూద్ కూడా అప్పట్లో స్పష్టం చేశారు. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన్ను నియమించడం, ఆ వెంటనే ఆయన కార్యాలయాలపై ఐటీ సోదాలు జరగడం.. ఇదంతా బీజేపీ ఆడిస్తున్న పొలిటికల్ గేమ్ అంటూ విమర్శలు రావడం చకచకా జరిగిపోయాయి. ఢిల్లీలో విద్యా కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సోనూ.. ఇటు పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా దగ్గరయ్యారు. పంజాబ్ ఐకాన్ గా ఆయన కొన్నాళ్ల క్రితం నియమితులయ్యారు. ఇటీవల తన సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన సోనూ సూద్ కొన్ని ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్టేట్ ఐకాన్ గా ఉంటూ.. సోనూ ఇలా రాజకీయ ప్రచారాలకు వెళ్లడం సరికాదని కొంతమంది ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేసి సైలెంట్ అయ్యారు.

నోటిఫికేషన్ తర్వాత క్లారిటీ..
నిన్న మొన్నటి వరకు మోగా నియోజకవర్గం నుంచి సోనూ సూద్ సోదరి, మాళవిక.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా వారు కాంగ్రెస్ వైపు వచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదిపింది. అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియలో.. గెలుపు గుర్రాల వేటలో ఉన్న కాంగ్రెస్.. మోగా నుంచి సోనూ సూద్ సోదరిని హస్తం గుర్తుపై పోటీ చేయాలని అభ్యర్థించింది. రాజకీయ పార్టీ అండదండలు లేకుండా నెగ్గుకు రావడం కష్టం అని భావించిన సోనూ.. అటువైపు మొగ్గు చూపారు. దీంతో పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ సమక్షంలో సోనూ సోదరి మాళవిక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

సోనూ సూద్ ప్రచారం వరకే..
తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని గతంలోనే స్పష్టం చేసిన సోనూ సూద్.. సోదరిని కాంగ్రెస్ లో చేర్చి, తాను మాత్రం కండువా కప్పుకోకుండా నిలబడ్డారు. సోదరి తరపున ఆయన మోగాలో విస్తృత ప్రచారం చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను అంత తేలిగ్గా వదిలిపెడుతుందా..? సోనూతో రాష్ట్రవ్యాప్త ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మార్చి 10న మిగతా అన్ని రాష్ట్రాలతో కలిపి ఫలితాలు వెలువడతాయి.