అధికార పార్టీల్లో అంతర్గత కుమ్ములాటలు..

ఐదు రాష్ట్రాలకు త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి ఉత్తర ప్రదేశ్, పంజాబ్ పైన్ ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలు తమ పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ మళ్లీ గద్దెనెక్కాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. యూపీలో తేడా కొడితే దాని ప్రభావం వచ్చే లోక్ సభ ఎన్నికలపై పడుతుందని బీజేపీ అధినాయకత్వం కూడా భయపడుతూనే ఉంది. ఇక పంజాబ్ విషయానికొస్తే అధికార కాంగ్రెస్ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. రైతు చట్టాల వ్యవహారంతో బీజేపీపై వ్యతిరేకత వచ్చేసిందని, అది తమకు అనుకూలంగా ఉంటుందనేది కాంగ్రెస్ భావన. చివరిలో సీఎం మార్పు వ్యవహారం తలనొప్పిగా మారినా.. అమరీందర్ ని సాగనండం ద్వారా సిద్దూ అలక తీరడంతో కొత్త తరం నాయకత్వంతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది కాంగ్రెస్.

యూపీలో రాజీనామాల లుకలుకలు..
అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న వేళ, యూపీలో మంత్రులు, ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలు సీఎం యోగికి షాకిచ్చాయి. అధికార పార్టీనుంచి ఈ రేంజ్ లో వలసలుంటాయని ఎవరూ ఊహించలేదు. అయితే ఇది యోగిపై ఉన్న వ్యతిరేకతా, లేక కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్ల యూపీలో ఓటమి భయంతో ముందే బీజేపీ నేతలు గోడ దూకేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. ఈ వలసలతో సహజంగానే సమాజ్ వాదీ పార్టీకి నైతిక బలం పెరుగుతోంది. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీకి దూరంగా ఉండటం, కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో పుంజుకోకపోవడంతో.. యూపీ పోరు బీజేపీ, ఎస్పీ మధ్యే అన్నట్టుగా ఉంది. మొత్తమ్మీద వలసలతో యూపీ బీజేపీ సలసల మరిగిపోతోంది. చివరి నిముషంలో యోగికి ఆందోళన పెరిగిపోతోంది.

పంజాబ్ లో చన్నీ వర్సెస్ సిద్ధూ..
అటు పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కి కూడా అంతర్గత కుమ్ములాటలు అగ్ని పరీక్షలా మారాయి. సీఎం అభ్యర్థి నేనంటే నేనంటూ తాజా సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ పరోక్ష యుద్ధానికి దిగారు. ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలంటారు చన్నీ, ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలే సీఎంని ఎన్నుకుంటారని కౌంటర్ ఇస్తారు సిద్ధూ. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం సాధ్యం కాదని గ్రహించిన అధిష్టానం.. అంతా ఎన్నికల తర్వాత చూసుకుంటామని అంటోంది. అప్పటి వరకు పార్టీకి నష్టం కలిగించొద్దని సర్ది చెప్పుకుంటోంది. మొత్తమ్మీద పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ చేసే డ్యామేజీ కంటే.. చన్నీ వర్గం, సిద్ధూ వర్గం మధ్య కుమ్ములాటలే కాంగ్రెస్ కి ఎక్కువ నష్టం కలిగించేలా ఉన్నాయనేది విశ్లేషకుల మాట.