ఏపీలో తొలి డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకి రంగం సిద్ధం..

చుట్టూ నీరు, కానీ గొంతు తడుపుకోడానికి గుక్కెడు కూడా పనికి రావు. నీరు నిత్యావసరం అని తెలిసినా కూడా అలాంటి ప్రాంతాలను వదిలి స్థానికులు దూరంగా వెళ్లలేరు, అలాగని అక్కడే చస్తూ బతకలేరు. తీర ప్రాంత వాసుల కష్టాలు ఇలాగే ఉంటాయి. అందులోనూ వర్షాభావ పరిస్థితుల వల్ల రోజు రోజుకీ ఇక్కడ నీటిలో ఉప్పు శాతం పెరిగిపోతూ ఉంది. తీర ప్రాంతం నుంచి దూరంగా వెళ్లినా నీరు ఉప్పగా మారిపోతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. మిగతా కోస్తా జిల్లాల్లో పరిస్థితులు ఇంత దారుణంగా లేవు, కానీ ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొత్త పట్నం ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ఉప్పగా మారిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీరి కష్టాలు తెలుసుకున్న సీఎం జగన్.. త్వరలో ఇక్కడ డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

రూ.35కోట్లతో పనులు..
35 కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త పట్నం ప్రాంతంలో డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఏపీలోనే ఇది తొలి ప్రాజెక్ట్. కేంద్ర జలజీవన్ మిషన్ భాగస్వామ్యంతో దీన్ని పూర్తి చేస్తారు. రోజుకి 60 లక్షల లీటర్ల మంచినీటిని ఈ ప్లాంట్ ఉత్పత్తి చేయగలదు. 14 మత్స్యకార గ్రామాలకు ఇది ఉపయోగపడుతుంది. 50వేలమంది ప్రజల దాహార్తిని తీర్చబోతోంది. స్థల సేకరణ పూర్తి కావడంతో పనులు మొదలు పెడుతున్నారు.

చెన్నైలో భారీ ప్రాజెక్ట్..
డీశాలినేషన్ ప్రాజెక్ట్ లు ఖర్చుతో కూడుకున్నవి. సముద్ర జలాలను మంచినీటిగా మార్చాలంటే లవణాలు, ఇతర మలినాలను తొలగించాల్సి ఉంటుంది. అయితే నేరుగా సముద్ర నీటిని కాకుండా.. కొంత దూరంలో ఉన్న భూగర్భ జలాలను వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అక్కడ నీటిలో ఉప్పు శాతం కాస్త తక్కువగా ఉంటుంది. భారత్ లోనే కాదు, దక్షిణాసియాలోనే అతి పెద్ద డీశాలినేషన్ ప్లాంట్ చెన్నైలో ఉంది. మింజూరులో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ నుంచి రోజుకి 3.65 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసి ప్రజల అవసరాలకు వినియోగిస్తుంటారు. చెన్నైలో రెండో ప్లాంట్ వచ్చే ఏడాది నాటికి సిద్ధమయ్యే అవకాశాలున్నాయి.

ఇక ఏపీ విషయానికొస్తే.. ఇప్పటి వరకూ తీర ప్రాంత గ్రామాల్లో నీటి సమస్యను ఎదుర్కొనే ప్రజలకోసం మంచినీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కొన్ని చోట్ల స్థానికంగా లభించే నీటిని శుద్ధి చేసి వాడుతున్నారు. అయితే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో రోజు రోజుకీ నీటిలో ఉప్పుశాతం పెరిగిపోతోంది. దాదాపుగా ఒంగోలు పట్టణంలో కూడా సగభాగం గ్రౌండ్ వాటర్ ఉప్పగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీలో తొలి డీశాలినేషన్ ప్రాజెక్ట్ ఒంగోలు తీర ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు.